Search This Blog

Type Here to Get Search Results !

పూజ - శారీరిక క్రియ లేని మానసిక పూజ - Pooja

0
పూజ - శారీరిక క్రియ లేని మానసిక పూజ - Pooja
శివ పూజ 
పూజ..
ఎవరో చూస్తున్నారనో, వింటున్నారనో లేక భయపడో చేసే పూజ , పూజ కాదు. నీ కోసం, నీ మనస్సాక్షి కోసం, నీ మనశ్శాంతి కోసం అంటే మనకోసం మనం పూజ చేయాలి. ఆత్మ ఉన్నతి కోసం పూజ చేసుకోవాలి. మనస్సుతో కూడిన శరీర కర్మ ను పూజ అంటారు. మనస్సు లేని క్రియ పూజ అనిపించుకోదు.  
    శారీరిక క్రియ లేని మానసిక పూజను నిజమైన పూజ అంటారు. మరి క్రియ ఎందుకు?  మనస్సు అక్కడ నిలబడడానికి.  మనస్సుతో కూడిన క్రియను, కల్పమును "పూజ" అని అంటారు. అందుకు వచ్చింది పూజ ..షోడశోపచార పూజ....భగవంతుడు కూడా మన లాంటి వాడిలాగే భావించి ఆయనకు అర్ఘ్యం, ఆచమనీయం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, ఆభరణం , నైవేద్యం, తాంబూలం అంటూ  వివిధ రకాల ఉపచారములు చేసి  హారతి ఇచ్చి హమ్మయ్య నాకూ నిద్ర వస్తున్నది, నీవు బజ్జుకోవయ్యా  ...అంటూ మంగళ హారతులు ఇచ్చి పవళింపు సేవ చేసి మనం కూడా పడుకొంటాము....ఇది మనం చేసే నిత్య పూజ....ఎందుకంటే భగవంతున్ని మనలాగా పోల్చుకొని, మనకు కావలసిన, కోరుకొంటున్న ఉపచారములు అన్నీ భగవంతుడు కూడా మనలాగే అనుకొని తీర్చుకొంటున్నాము కృతజ్ఞతా భావముతో.

  మనం గుర్రం, ఏనుగు ...వాహనములు కోరుకొంటాము కాబట్టి ఆయన్ను కూడా గుర్రం ఎక్కిస్తాము. మనకు సుగంధ ద్రవ్యములు కావాలి కాబట్టి ఆయనకు చల్లాము. మనకు మధుర పదార్ధములు కావాలి కాబట్టి ఆయనకు నివేదించుకొన్నాము.
  నిజానికి భగవంతుడికి ఇవన్నీ కావాలనా ? పల్లేదు....మరి ఎందుకు ఇస్తున్నాము?  మన తృప్తి కోసం. మనకు అవన్నీ కావాలి కాబట్టి, మనలోని ఆ పరమాత్మకు అవన్నీ నివేదిస్తున్నాము. నేను బ్రాహ్మణున్ని నాకు చక్కేర పోంగలి ఇష్టం, నేను అదే తింటాను కాబట్టి భగవంతుడికి కూడా అదే పెడతాను. నాకు పట్టు పంచలు ఇష్టం కాబట్టి భగవంతుడికి కూడా అవే పెడతాను.....ఓక బెస్తవాడు వున్నాడు, వాడు చేపలు తింటాడు, వాడు భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చేపలు మాత్రమే పెడతాడు,  కల్లు ఇస్తాడు, పానకం ఇవ్వడు, దద్ధోజనం పెట్టడు. ఆ చేపలు తిని, కల్లు త్రాగి భగవంతుడు వాడ్ని అనుగ్రహిస్తాడు....అదేమిటి భగవంతుడు కల్లు త్రాగుతాడా అంటే త్రాగుతాడు. కన్నప్ప మాంసం పెడితే తినలేదా? అసలు ఇన్ని రూపాలలో తింటున్నది, త్రాగుతున్నది ఏవరు ఆ విశ్వంభరుడే...
 ఎవడు ఏ రూపంలో వుంటాడో అదే రూపంలో భగవంతుడు వుంటాడు అని భావించి తనకు ఇష్టమైన, తను తినే పదార్ధములనే భగవంతుడికి పెడతాడు...అదే భక్తి. మనం ఏది తింటామో, భగవంతుడు కూడా అదే తింటాడు, అదే త్రాగుతాడు....జాతికి తగ్గట్టు, వర్ణానికి తగ్గట్లు,  సాంప్రదాయమునకు తగ్గట్లు పూజ వుంటుంది, నైవేద్యం  వుంటుంది. ఇది తప్పు అని చెప్పడానికి మనం ఎవ్వరం?

   ఓక గిరిజన కన్య వాళ్ల కొండ దేవతకు పొట్టేలు మాంసం పెట్టి, విప్ప సారా పోస్తుంది. అలా మనం చేయగలమా? లేము. కారణం మనం తినడం లేదు కాబట్టి....నీ ఇంటి ఆచారం ప్రకారం, ధర్మం ప్రకారం నీవు చెయ్యి. నీ పెద్దలను, గురువులను అనుసరించు..ఇతరులను అనుసరించ వద్దు.
ఓక పందిని వెళ్లి ...." భగవంతుడు"... ఏలా వుంటాడు అని అడిగితే, ......" నా లాగే పంది రూపంలో"...వుంటాడు అని చెబుతుంది....అదే విధముగా కుక్క, నక్క, చిలుక, పక్షి,  ఏనుగు, చీమ, చేప......ఇలా అన్నీ తమ తమ రూపాలలో వుంటాడు భగవంతుడు ...అని చెబుతాయి.

  మనిషిని అడిగితే మనిషి కూడా చెబుతాడు భగవంతుడు తన లాగే మానవ రూపంలో వుంటాడు అని. మరి నిజంగా భగవంతుడు ఏ రూపంలో వుంటాడు?  అన్ని రూపాలలో వుంటాడు....ఏవరి భావనకు తగ్గట్లుగా ఆ ఆకృతిలో పట్టుకోవడానికి వీలుగా భగవంతుడు వుంటాడు....చేప రూపంలో వుండడు అని చెప్పడానికి మనం ఎవ్వరమూ?  ఏమో వుంటాడేమో?? పంది రూపంలో వుంటాడేమో, మనిషి రూపంలో వుంటాడేమో, జ్యోతి రూపంలో, చెట్టు రూపంలో, పుట్ట రూపంలో, పక్షి రూపంలో. రకరకాల రూపంలో వుంటాడేమో. ఇన్ని జీవరాసులు వున్నప్పుడు ఖచ్చితంగా ఆయా రూపాలలో భగవంతుడి వుండి వుంటాడు.
 కాబట్టి భగవంతుడు అంతటా, అన్నింటా వున్నాడు అని పెద్దలు అంటారు.....అంతటా నిండి నిబిఢీకృతమైన ఆపరమాత్మకు నిత్య పూజలు మనం చేస్తున్నాము.....

రచన: భాస్కరానంద నాథ

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు